తనలాంటి వాళ్లకి వెన్నుదన్నుగా..! – ప్రీతి శ్రీనివాసన్ యొక్క స్ఫూర్తిదాయకమైన ప్రయాణం

చదువుల్లో టాపర్‌…నాలుగేళ్ల వయసులోనే క్రికెట్‌లోకి అడుగులు… 8ఏళ్లకే అండర్‌-19 స్టేట్‌ టీమ్‌ కెప్టెన్‌…అపజయం అంటే ఏంటో తెలియకుండా సాగుతోన్న ఆ అమ్మాయి జీవితాన్ని అనుకోని ప్రమాదం పూర్తిగా మార్చేసింది. వెన్నెముక గాయంతో పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి వచ్చింది.

చదువుల్లో టాపర్‌…నాలుగేళ్ల వయసులోనే క్రికెట్‌లోకి అడుగులు… 8ఏళ్లకే అండర్‌-19 స్టేట్‌ టీమ్‌ కెప్టెన్‌…అపజయం అంటే ఏంటో తెలియకుండా సాగుతోన్న ఆ అమ్మాయి జీవితాన్ని అనుకోని ప్రమాదం పూర్తిగా మార్చేసింది. వెన్నెముక గాయంతో పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో తనను తాను చూసుకోవటమే ఎక్కువ. కానీ చెన్నైకి చెందిన ప్రీతి శ్రీనివాసన్‌ ‘సోల్‌ఫ్రీ’ అనే ఛారిటబుల్‌ ట్రస్టును స్థాపించి తనలాంటి వారికీ చేయూతనిస్తోంది.

సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ స్ఫూర్తితో నాలుగేళ్లకే క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టిన ప్రీతి…8ఏళ్ల వయసులోనే తమిళనాడు స్టేట్‌ టీమ్‌కు అండర్‌- 19కెప్టెన్‌ అయింది. చదువుల్లోనూ చురుకే. అంతా బాగుంది అనుకునే సమయంలో ఓ సంఘటన తన జీవితాన్నే మార్చేసింది. అప్పుడు తనకు పద్దెనిమిదేళ్లు… స్నేహితులతో కలిసి పుదుచ్చేరి బీచ్‌లో ఆడుకుంటూ ఉండగా అనుకోకుండా కిందపడిపోయింది. వెన్నుపూసకి బలమైన దెబ్బతగిలి మెడ కింద భాగం చలనం లేకుండా అయింది. కాళ్లూ చేతులూ పనిచేయలేదు. బంతిని వేగంగా, బలంగా విసిరే ప్రీతి… చిటికెన వేలును కూడా కదిలించలేని స్థితిలోకి వెళ్లింది. తినటానికి, స్నానం చేయించటానికి, కనీసం మంచం మీద నుంచి లేవాలన్నా ఇతరుల సాయం కావాల్సిందే. ఈ పరిస్థితి తనను మానసికంగానూ కుంగదీసింది. ఆ సమయంలో తల్లిదండ్రులు మనోధైర్యాన్నిచ్చారు. వాళ్ల నాన్న ఆమె కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. మనసు ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో చెన్నై నుంచి తిరువణ్ణామలైకి మకాం మార్చారు. తను మళ్లీ చదువుకోవాలనుకున్నప్పుడు… ఇటువంటి వాళ్లు చదువుకోడానికి ఎందుకొస్తారు అని హేళన చేసిన వాళ్లూ ఉన్నారు. అయితే ఆమె తండ్రి మాత్రం ‘సొంతంగానే చదువుకో’ అని పాఠ్య పుస్తకాలతోపాటు స్ఫూర్తిదాయక, ఆధ్యాత్మిక పుస్తకాలెన్నింటినో తెచ్చేవారు. అలా మెల్లగా తన కష్టాన్ని మరిచిపోసాగింది కానీ అప్పుడే తన జీవితాన్ని కుదిపేసే మరో సంఘటన జరిగింది. గుండెపోటుతో ఆమె తండ్రి చనిపోయారు. అది జరిగిన నాలుగు రోజులకు వాళ్ల అమ్మ కూడా హార్ట్‌ ఎటాక్‌కు గురయ్యారు. బైపాస్‌ సర్జరీతో బతికారు. కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ప్రీతిపైనేే పడింది. స్నేహితుల సలహాతో బీఎస్సీ మెడికల్‌ సోషియాలజీలతో పాటు ఎమ్మెస్సీ సైకాలజీ చేసింది.
వాళ్లిద్దరినీ చూసి…

ఆ తరవాత జరిగిన ఓ సంఘటన… ఆమెను తీవ్రంగా కలచివేసింది. తనకు తెలిసిన దివ్యాంగులైన ఇద్దరమ్మాయిల్ని పోషించలేక కుటుంబ సభ్యులే విషమిచ్చి చంపేశారు. ఈ సంఘటన తనను ఎంతో బాధించింది. తనలాంటి వారికి చేయూతనివ్వాలనే లక్ష్యంతో 2013లో ఇన్‌స్పైర్‌(ఇంటిగ్రేటెడ్‌ స్పైనల్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌) ప్రారంభించింది. అయితే తన ఆర్థిక స్థితీ అంతంతమాత్రం. అందుకే నేరుగా ఎవరినీ సాయమడగటం ఇష్టం లేని ప్రీతి… స్కూళ్లు, కాలేజీలు, కార్పొరేట్‌ సంస్థలకు వెళ్లి మోటివేషనల్‌ తరగతులు చెప్పేది. వచ్చిన ఫండ్స్‌ను ‘సోల్‌ఫ్రీ’ కార్యకలాపాల కోసం వినియోగిస్తూ ఉచిత సేవలు అందిస్తోంది. దివ్యాంగులెవరైనా కేర్‌ టేకర్‌తో పాటు అక్కడికి వెళ్లి 6నెలలు ఉండొచ్చు. శారీరకంగా మానసికంగా వాళ్లకు రిహాబిలిటేషన్‌ కల్పిస్తారు. దీన్నే రీ-ఇంజినీరింగ్‌గా పిలుస్తారు ప్రీతి. ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్‌ థెరపీ, హైడ్రోథెరపీ, కౌన్సెలింగ్‌ సెషన్స్, కుట్టుపని, కంప్యూటర్‌ తరగతులు…వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. అవసరమైన వారికి మందులు, చక్రాల కుర్చీలు అందిస్తారు. ఇప్పటి వరకూ 2500మందికి సాయపడ్డారు. ‘మన ప్రాణాలు అన్నింటికన్నా విలువైనవి. కుటుంబానికి భారమై ఎవరూ చనిపోకూడదు’ అంటోన్న ప్రీతి ప్రస్తుతం ఐఐటీ మద్రాసులో పీహెచ్‌డీ చేస్తోంది. ఆమె సేవలకుగానూ మహిళా శక్తి, కల్పనా చావ్లా అవార్డులతో సహా మరెన్నో అవార్డులు వరించాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top