
‘పునర్జన్మ’… మరణాన్ని తప్పించుకున్న వాళ్లతో సాధారణంగా అనే మాటే! చాలామంది ఈ విషయంలో దేవుడికి ధన్యవాదాలు చెబుతుంటారు కూడా. కానీ క్యాన్సర్ బాధితుల పరిస్థితే వేరు. మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో మారిన రూపం… ఆ సంతోషాన్ని ఆవిరయ్యేలా చేస్తుంది. దీంతో ఆత్మవిశ్వాసమూ కోల్పోతారు.
‘పునర్జన్మ’… మరణాన్ని తప్పించుకున్న వాళ్లతో సాధారణంగా అనే మాటే! చాలామంది ఈ విషయంలో దేవుడికి ధన్యవాదాలు చెబుతుంటారు కూడా. కానీ క్యాన్సర్ బాధితుల పరిస్థితే వేరు. మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో మారిన రూపం… ఆ సంతోషాన్ని ఆవిరయ్యేలా చేస్తుంది. దీంతో ఆత్మవిశ్వాసమూ కోల్పోతారు. వారిని తిరిగి ధైర్యంగా నిలబడేలా చేస్తోంది ఆకృతి గుప్తా. అదెలాగో తెలియాలంటే ఆమె కథ చదివేయాల్సిందే!
ఆకృతిది దిల్లీ. అప్పుడామెకు 17ఏళ్లు. ఇంటర్ పరీక్షలకు సిద్ధమవుతోంది. కానీ వాటికంటే పెద్ద సవాలు ఆమె ముందు నిలిచింది. వాళ్ల నాన్నకి క్యాన్సర్. ఆ వార్తను నమ్మేలోపే ‘బతికే అవకాశాలు చాలా తక్కువ. ఆశలు వదులుకోవడం మేల’న్నారు డాక్టర్లు. అది వినగానే భయంతో బిగుసుకుపోయింది ఆకృతి. కానీ ఆమె, వాళ్లమ్మ ధైర్యం కోల్పోవద్దు అనుకున్నారు. అయినా చికిత్సలో భాగంగా తండ్రి అనుభవిస్తోన్న నరకాన్ని చూసి భయపడేవారు. అది గమనించారేమో తండ్రి వేరే వ్యాపకాలపై దృష్టిపెట్టాలనుకున్నారు. ఇంకెవరికైనా సాయపడుతుందని తన క్యాన్సర్ ప్రయాణాన్ని బ్లాగులో రాయడం మొదలుపెట్టారు. కానీ తెలియకుండానే ఆ పని ఆయనలో ఉత్సాహాన్ని నింపేది. అదిచూసి క్యాన్సర్ బాధితుల కోసం ఏదైనా చేయాలనుకుంది ఆకృతి. అప్పుడే ఈ మహమ్మారి బారినపడి ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తిని చూసింది. అసలే శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నవారిని ఆర్థిక ఇబ్బందులు మరింత దెబ్బతీస్తాయి. అది గమనించిన ఆమె ఓ ఎన్‌జీవోతో కలిసి అలాంటివారికి సాయపడే పథకాలు, ఉపాధి మార్గాలను చూపించింది.
అవగాహన కల్పిస్తూ…
తన సాయానికి ప్రతిఫలమా అన్నట్టు ఆశ్చర్యంగా సర్జరీతో వాళ్ల నాన్నకి గండం తప్పింది. అప్పటిదాకా భయంలో గడిపేసిందేమో… ఒక్కసారిగా ఆకృతికి ఏడుపు తన్నుకొచ్చేసింది. క్యాన్సర్ బాధితులే కాదు, వాళ్ల కుటుంబీకులూ తెలియకుండానే ఎంత మనోవేదనను అనుభవిస్తారో అర్థమైందామెకు. ‘విన్ ఓవర్ క్యాన్సర్’ అనే సంస్థతో కలిసి క్యాన్సర్, అది కుటుంబాలపై చూపే ప్రభావం, ఆ సమయంలో ధైర్యంగా ఉండాల్సిన అవసరం వంటివాటిపై అవగాహన కల్పించేది. అవసరమైనవారికి ఆర్థికసాయం అందేలానూ చూసేది. ఓవైపు నాన్నని చూసుకోవడం, మరోవైపు చదువు, సేవ… ఒకరకంగా తీరికలేని రోజుల్నే గడిపింది ఆకృతి. అయినా బాధితుల కుటుంబాలతో తప్పక మాట్లాడేది. ఆ క్రమంలోనే ఆమెకు ‘మాస్టెక్టమీ’ చేయించుకున్న ఒకామెతో పరిచయమైంది. బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా ఆమెకు ఒక రొమ్ము తొలగించారు. దీంతో ఆ స్థానంలో వస్త్రాలు, కాగితాలు, బొమ్మలను పెట్టుకోవడం, దారాలతో గట్టిగా కట్టుకోవడం లాంటివి చేసేదామె. కానీ ఒరిపిడి వల్ల చర్మం గాయపడేది. అమ్మాయిలకు శరీరం పూర్తిగా మారిపోవడం ఎంత పెద్ద దెబ్బో అప్పుడే ఆమెకు తెలిసింది. దీనికి ఏదైనా పరిష్కారం కనిపెట్టాలనుకుంది ఆకృతి.
‘చాలామంది క్యాన్సర్ నుంచి బయటపడితే ‘వారియర్’ అనేస్తారు కానీ… వాళ్లకు కావాల్సిన ధైర్యాన్ని ఎవరూ అందించరు. రొమ్ముకు సర్జరీ చేయించుకున్నవాళ్లే అందుకు ఉదాహరణ. మారిన రూపాన్ని కప్పిపుచ్చడానికి ఏవేవో చేస్తుంటారు. ఈక్రమంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. నిజానికి వీళ్లకి ప్రొస్థెసిస్ రొమ్ములు, ప్యాడెడ్ బ్రాలు దొరుకుతాయి. కానీ అవి ఖరీదు ఎక్కువ. కుటుంబానికి మరింత భారం కావొద్దని వాళ్లేమో నోరు తెరవరు. అమ్మ ఫ్యాషన్ డిజైనర్. తనతో కలిసి పరిశోధనలు చేసి, వివిధ వస్త్రాలతో వాళ్లకు సాయపడేలా బ్రెస్ట్ ప్రొస్థెసిస్‌లు తీసుకొచ్చాం. వైద్యుల సలహాతో తగిన మార్పులు చేసి, వాటిని అందరికీ పంచా’మంటోంది ఆకృతి. వాటిని ఎయిమ్స్ స్వయంగా పరిశీలించడమే కాదు, తమ రోగులకోసం ఆర్డర్లనీ ఇచ్చింది. ఇవన్నీ చేస్తూనే టిస్, ముంబయి నుంచి సోషల్‌సైన్సెస్‌లో పీజీ పూర్తిచేసింది ఆకృతి. ఆపై 2020లో ‘కాన్‌ఫెమ్’ ప్రారంభించి… తక్కువ ధరకే సిలికాన్, ఫ్యాబ్రిక్ బ్రెస్ట్ ప్రోస్థెసిస్‌లు, విగ్‌లు, క్యాన్సర్ బ్రా, స్కార్ఫ్స్ వంటివెన్నో తీసుకొచ్చింది. క్యాన్సర్ బాధితులతోపాటు, దాన్నుంచి బయటపడినవారికి ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్, మెంటల్ వెల్‌బీయింగ్ థెరపీ, న్యూట్రిషన్ వంటి వివిధ అంశాలపై అవగాహన, తక్కువ ఖర్చుతో సెషన్లు ఇప్పిస్తోంది. ‘ఒకప్పుడు… చిన్నపిల్లవి, ఇవన్నీ ఎందుకు? చదువుపై దృష్టిపెట్టు అనేవారంతా. ఇప్పుడు నావల్ల ఎంతోమంది ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంటే ఆనందంగా ఉంద’నే 25 ఏళ్ల ఆకృతి వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి గ్లోబల్ స్టూడెంట్ ఆంత్రప్రెన్యూర్, గత ఏడాది డయానా అవార్డు, తాజాగా యంగ్ ఆంత్రప్రెన్యూర్ వంటివెన్నో పురస్కారాలను అందుకుంది. ఈమె టెడెక్స్ స్పీకర్ కూడా.