శరీరానికి ఇబ్బంది వస్తే వైద్యుల దగ్గరికి వెళతాం. మరి మనసు బాధ సంగతేంటి? దాన్ని గుర్తించడమే కష్టమవుతోంది. గుర్తించినా ఎవరికీ చెప్పలేరు. వైద్యులను సంప్రదించాలన్న ఆలోచనే రాదు. ఖర్చు భయం కూడా అందుకు కారణమే. దీంతో ఎంతోమంది మానసిక సమస్యల బారిన పడుతున్నారు.
శరీరానికి ఇబ్బంది వస్తే వైద్యుల దగ్గరికి వెళతాం. మరి మనసు బాధ సంగతేంటి? దాన్ని గుర్తించడమే కష్టమవుతోంది. గుర్తించినా ఎవరికీ చెప్పలేరు. వైద్యులను సంప్రదించాలన్న ఆలోచనే రాదు. ఖర్చు భయం కూడా అందుకు కారణమే. దీంతో ఎంతోమంది మానసిక సమస్యల బారిన పడుతున్నారు. వారికి తన సంస్థ ‘ద ఏబుల్ మైండ్’ ద్వారా అండగా నిలుస్తున్నారు రోహిణీ రాజీవ్.
‘నేను చనిపోతున్నా… నాకు ఇక బతకాలని లేదు’ చేతిలో కత్తినో, నిద్ర మాత్రలనో పట్టుకొనో, ఎత్తైన ప్రదేశాలను ఎక్కో ఫోన్ చేస్తే మీకేం అనిపిస్తుంది? చదువు పూర్తయ్యి బెంగళూరులోని సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్‌లైన్, ‘సహాయ్’లో ఇలా వాలంటీర్‌గా చేరానో లేదో ఇలాంటివెన్నో ఎదురయ్యాయి నాకు. గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ మాట తొణకకుండా వారి ఆలోచన మార్చడం పెద్ద సవాలు. తమిళనాడులో పెరిగిన మలయాళీ అమ్మాయిని. బెంగళూరులో స్థిరపడ్డాం. మెడికల్ అండ్ సైకియాట్రీ సోషల్ వర్క్‌లో మాస్టర్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి పీహెచ్డీ పూర్తిచేశా. పీజీ పూర్తయ్యాక వాలంటీర్‌గా చేస్తూనే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నుంచి ‘సాల్వ్’ కోర్సుతో పాటు సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్‌ప్లేస్, సూసైడ్ ప్రివెన్షన్ వంటివీ చేశా. ‘1టూ1హెల్ప్, బాష్ గ్లోబల్ సాఫ్ట్వేర్’ వంటి సంస్థల్లో ‘సోషల్ కౌన్సెలర్’గా ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, వాళ్ల బాగోగులకు అవసరమైన ఫ్రేమ్‌వర్క్, పాలసీలు రూపొందించా. మ్యారిటల్, ఫ్యామిలీ థెరపిస్ట్‌ని కూడా.
తెలుగు రాష్ట్రాలు సహా…
మెడికో పాస్టరల్ అసోసియేషన్ తరఫున విద్యార్థుల కోసం తెలుగు రాష్ట్రాలు సహా దాదాపు దేశమంతా వర్క్‌షాప్‌లు, వెల్నెస్ కోచింగ్ వర్క్‌షాప్‌లు నిర్వహించా. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల తరఫున వ్యక్తులు, దంపతులు, కుటుంబాలకు రీహాబిలిటేషన్, సైకోథెరపీ వంటివీ అందించా. అవతలి వాళ్ల కథలు విని, వారి దిశ మళ్లించి సంతోషాన్ని అందుకునేలా చేసే క్రమంలో గుండెను పిండేసే సందర్భాలెన్నో. చిన్నవయసులో ఒత్తిడి బారిన పడటం, ఆల్కహాల్, డ్రగ్స్‌కి బానిసలవడం చూస్తే మనసు వికలమయ్యేది. మరింతమందికి సేవల్ని చేరువ చేయొచ్చని 2017లో ‘డిస్ట్రెస్ హోలిస్టిక్ హెల్త్’ సంస్థని ప్రారంభించా. రూ.500 మాత్రమే తీసుకుంటా. దీంతో నోటిమాటతోనే ప్రచారం వచ్చింది. కానీ కొవిడ్ వచ్చాక సేవలకు అడ్డుకట్ట పడింది. నిపుణురాలినైనా నాకే పరిస్థితేంటో తెలియక ఆందోళన. ఇక మామూలు వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది? చాలామంది సంప్రదించేవారు. కానీ వాళ్లని కలవలేని పరిస్థితి. ఒకరకంగా వాళ్లకి సాయపడలేకపోతున్నానని ‘గిల్టీనెస్’ కమ్మేసింది. అప్పుడే మానసిక నిపుణుల కొరత చాలా ఉందని అర్థమైంది. దీంతో సేవలను ఆన్లైన్ బాట పట్టిస్తూ 2021లో సంస్థని ‘ద ఏబుల్ మైండ్’గా మార్చాం.
అందుకే యాప్…
నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఒక్క 2022లోనే 1.71 లక్షలమంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. 2018 కంటే అది 27% పెరిగింది. దీనికి ఒత్తిడి, ఆందోళనలే కారణమంటే నమ్ముతారా? ఒంటరిగా పెరగడం, బాడీ షేమింగ్, అవమానాలు, ఇతరులతో పోలికలు, బంధంలో సమస్యలు… ఇలా వాటికి కారణాలెన్నో! వినేవారు లేరనో, నవ్వుతారనో బయటికి చెప్పలేక మనసులో బాధనీ, ఇబ్బందినీ లోలోపలే అణచుకుంటున్నారు. తట్టుకోలేనప్పుడు ప్రాణాలను బలిపెడుతున్నారు. దేశంలో వీటిని గమనించుకొని వైద్యుల సాయం తీసుకుంటున్నవారు ఒక శాతంకన్నా తక్కువే అంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటివాళ్లు మనసు విప్పి బాధను పంచుకునే అవకాశం ఇవ్వాలని మావారు రాజీవ్‌తో కలిసి, ద ఏబుల్ మైండ్‌ని యాప్‌గా… తెలుగు, ఇంగ్లిష్, హిందీ సహా 10 భాషల్లో తీసుకొచ్చా. దీనిలో మెసేజ్‌లు, కాల్స్ రూపంలో నిపుణులతో మాట్లాడొచ్చు. వాళ్ల వివరాలు బయటకు చెప్పకుండానే మనసు భారాన్ని తగ్గించుకోవచ్చు. అపాయింట్మెంట్ల బాధే ఉండదు. వీలునుబట్టి, ఆన్లైన్, ఆఫ్‌లైన్ థెరపీలనూ సూచిస్తాం. దీనికోసం నిపుణులను ఒక తాటిమీదకి తీసుకొచ్చా. ఒత్తిడి, ఆందోళనల బారిన పడేవారిలో టీనేజర్లు, మహిళలే ఎక్కువ. భయపడటం, ఖర్చుకు వెనకాడటం… ఇవే వారిని చీకటిలోకి తోస్తున్నాయి. కాస్త అవగాహనతో వారిని బయటపడేయొచ్చని నా ప్రయత్నం.
🖊️బ్యూరో చీఫ్: కె.కళ్యాణి, మంచుకొండ™ ఇన్సైట్స్ మ్యాగజైన్