వారు అందరిలాంటి ఉపాధ్యాయులే.. విధి నిర్వహణలో మాత్రం విభిన్న, ప్రత్యేక పనితీరు కనబరుస్తారు. సరిగ్గా చదవని పిల్లలపై బెత్తం ఎత్తలేదు.. వారి చెవులు మెలిపెట్టలేదు.. వారు అల్లరి చేస్తున్నారని కోప్పడలేదు.. క్రమశిక్షణ లేదని కసురుకోనూలేదు.
- పిల్లలతో అనుబంధాన్ని పెంచుకున్న గురుబ్రహ్మలు
- వారికి వృత్తే దైవం, పాఠశాలే దేవాలయం
- ఆప్యాయతను పంచుతూ విద్యార్థుల మనసు గెలిచారు
- అందుకే బదిలీపై వెళ్తోంటే చిన్నారుల కన్నీరుమున్నీరు
వారు అందరిలాంటి ఉపాధ్యాయులే.. విధి నిర్వహణలో మాత్రం విభిన్న, ప్రత్యేక పనితీరు కనబరుస్తారు. సరిగ్గా చదవని పిల్లలపై బెత్తం ఎత్తలేదు.. వారి చెవులు మెలిపెట్టలేదు.. వారు అల్లరి చేస్తున్నారని కోప్పడలేదు.. క్రమశిక్షణ లేదని కసురుకోనూలేదు. చిరునవ్వునే నల్లబల్లగా… ఓర్పునే సుద్దముక్కగా చేసుకున్నారు. ప్రేమతో చదువు చెప్పారు. అర్థమయ్యేలా పాఠాలు బోధించారు. పిల్లలకు ఏ చిన్న కష్టమొచ్చినా మేఘమల్లే కరిగారు. ఆర్థికంగానూ అండగా నిలిచారు. అందుకే వారు బదిలీపై వెళ్తోంటే ఆ విద్యార్థులు తట్టుకోలేకపోయారు. వెక్కివెక్కి ఏడ్చారు. వెళ్లొద్దొంటూ అడ్డంపడ్డారు. తమతోనే ఉండండంటూ వేడుకున్నారు. విధిలేని పరిస్థితిలో బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు పలికారు. మా సారున్న చోటే మేమూ చదువుతామంటూ కొందరు వారి వెంటే కదిలారు. అలాంటి పలువురు ఆదర్శ ఉపాధ్యాయులు, వారి పనితీరుపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం…
బడిని గుడిగా మలిచిన మాస్టార్లు
ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒక పాఠశాలలో నియమితులైతే వారు కోరుకుంటే తప్ప ఎనిమిదేళ్ల వరకు బదిలీ ఉండదు. ఒకవేళ సర్కారు బదిలీ చేయకుంటే అక్కడ ఇంకా ఎక్కువ కాలమే పనిచేస్తారు. ఈ క్రమంలో కొందరు ఉపాధ్యాయులు తమ అంకితభావం, బోధించే తీరు, విద్యార్థుల్లో విజ్ఞానతృష్ణ పెంచేందుకు పడే తపన, వారిపై చూపించే ఆప్యాయతలతో పిల్లల మనసుల్లో చెరగని ముద్ర వేస్తారు. అయితే, ప్రభుత్వ నిబంధ]నల ప్రకారం ఏదో ఒకరోజు ఉపాధ్యాయులు బదిలీ కాకతప్పదు. కానీ, తమకిష్టమైన గురువులు బడిని విడిచి వెళ్లిపోతోంటే పిల్లల గుండెలు బరువెక్కుతాయి. విడిచి వెళ్లలేక గురువులు, వదిలిపెట్టలేక పిల్లలు పడే బాధను చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలోని సర్కారు బడులు ఇలాంటి గురుశిష్యుల ప్రేమానురాగాలను ఆవిష్కరించాయి.
ముందుగా వచ్చి… ప్రత్యేకంగా బోధించి
సిరిసిల్ల పట్టణంలోని శివనగర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రోజూ గంట ముందుగా విధులకు హాజరయ్యేవారు. చదువులో వెనకబడిన పిల్లలకు ప్రత్యేకంగా బోధించేవారు. పిల్లలతో కలిసి ఆటలు ఆడేవారు. ఏడాదికి ఐదుకు మించి సెలవులు తీసుకోలేదు. రెండేళ్లపాటు ఒక్క సెలవూ పెట్టలేదంటేనే పనిచేసే పాఠశాలన్నా, చిన్నారులన్నా ఆయనకు ఎంతిష్టమో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఎస్‌జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతిపై లక్ష్మణ్ బదిలీ అయ్యారు. పదోన్నతి ఆనందాన్నిచ్చినా బదిలీతో కంటతడి పెట్టని చిన్నారులు లేరు.
వేసవిలోనూ తరగతులు… పూర్వ విద్యార్థులకూ పాఠాలు
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఎస్జీటీ వీరేశం.. తన పనితీరుతో విద్యార్థులు, తల్లిదండ్రుల అభిమానం చూరగొన్నారు. 2018లో పాఠశాలకు వచ్చిన ఆయన.. ఎవరైనా పిల్లలు గైర్హాజరైతే వారి ఇళ్లకు వెళ్లేవారు. తల్లిదండ్రులతో మాట్లాడి చదువు ప్రాధాన్యం వివరించేవారు. దీంతో గైర్హాజరు పూర్తిగా తగ్గిపోయింది. స్వచ్ఛంద సంస్థల నుంచి రూ.2 లక్షలు సేకరించి.. బడికి కంప్యూటర్లు సమకూర్చారు. సొంతంగా ప్రొజెక్టర్ కొనిచ్చారు. ఊళ్లోని యువ ఉద్యోగులు టీవీ ఇచ్చారు. ఫలితంగా విద్యార్థుల సంఖ్య 82 నుంచి 124కు పెరిగింది. ఇక్కడ ఏడో తరగతి వరకు చదివి పైతరగతుల కోసం ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఏటా జనవరి నుంచి మార్చి వరకు ప్రత్యేక తరగతులు బోధించారు. స్థానిక యువత సహకారంతో రెండేళ్ల నుంచి వేసవి సెలవుల్లో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ‘సమ్మర్ స్కూల్’ నిర్వహించారు. ప్రతి ఆదివారం డ్రాయింగ్, మార్షల్ ఆర్ట్స్, స్పోకెన్ ఇంగ్లిష్‌పై శిక్షణ ఇప్పించారు. వీరేశం చొరవతో 45 మంది విద్యార్థులు గురుకులాలకు ఎంపికయ్యారు. అది పిల్లలు, గ్రామస్థులతో అనుబంధం పెంచింది. తాజాగా ఆయన బదిలీ ఆ వేదన నింపింది.
ప్రయోగాలతో స్ఫూర్తి నింపారు
మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం యెన్మనగండ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు టీఎన్ శ్రీధర్ పాఠశాల అభివృద్ధికి పెద్దఎత్తున విరాళాలు సేకరించారు. ప్రాజెక్టులు, ప్రాక్టికల్స్ ద్వారా పిల్లలకు సులభంగా పాఠాలు అర్థమయ్యేలా చేశారు. విద్యార్థుల కోసం తన ఇంట్లో రూ.10 లక్షలతో ప్రయోగశాల ఏర్పాటు చేశారు. ఇన్‌స్పైర్ పోటీల్లో పలుమార్లు విద్యార్థులను జాతీయస్థాయిలో విజేతలుగా నిలిపారు. అందుకే ఆయనకు బదిలీ కావడంతో.. విద్యార్థులు బోరున విలపించారు.
ఆంగ్లమంటే భయం పోగొట్టారు
మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం పెదకిష్టాపురం ప్రాథమిక పాఠశాలలో 2015 జులైలో బాదావత్ శ్రీను ఉపాధ్యాయుడిగా చేరారు. అక్కడి గిరిజన విద్యార్థులకు ఆంగ్లమంటే భయం ఎక్కువ. దాన్ని పోగొట్టేందుకు వినూత్నంగా ఆలోచించారు. పదాలను విడగొట్టి.. కొత్త పదాలు రూపొందించారు. ఒక పదంలోని అక్షరాలతో మరిన్ని పదాలు రాయించడం, పజిల్స్ నింపడం, కొన్ని పదాలతో వాక్యాలు తయారు చేయించడం, ఒక పదం చెబితే దానికి సమానార్థ, వ్యతిరేక పదాలను చెప్పడం ప్రారంభించారు. ప్రతిభావంతులైన విద్యార్థులతో ఇతర పిల్లలకు చెప్పించారు. ఇద్దరు, ముగ్గురు మాట్లాడుకునేలా సంభాషణలు రాయించారు. దాంతో కొన్ని నెలల్లోనే ఆంగ్లమంటే భయం పోయి ఆసక్తి పెరిగింది. ఓ విద్యార్ధి 20 పదాలతో 625 వాక్యాలు తయారు చేయడం గమనార్హం.
ఆటపాటలతో ఆసక్తి పెంచారు
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని క్లబ్ రోడ్డు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రామగిరి దిలీప్… తాజాగా ముల్కల్లగూడకు బదిలీ అయ్యారు. అయితే, మీరున్న చోటే చదువుకుంటామంటూ క్లబ్ రోడ్డు బడి నుంచి 89 మంది విద్యార్థులు వచ్చి ముల్కల్లగూడ పాఠశాలలో చేరిపోయారు. ఆయన వారించినా పిల్లలు, తల్లిదండ్రులు వినలేదు. దీని వెనుక ఆయన కృషి ఎంతో దాగుంది. తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు.. అధికారుల్ని ఒప్పించి బడిని ఆంగ్ల మాధ్యమంగా మార్చారు. ప్రీ ప్రైమరీ కూడా ప్రారంభించారు. పిల్లల్లో ఆసక్తి పెంచడానికి జాయ్‌ఫుల్ లెర్నింగ్ తరహాలో ఆటలు, పాటలతో చదువు చెప్పారు. గోడలపై ఛార్టులు అతికించి వాటిని రోజూ సాధన చేయించారు. కార్డులపై చిత్రాలు గీసి వాటి ద్వారా పాఠాలు బోధించారు.
తల్లిదండ్రులకు నమ్మకం కలిగించారు
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ ప్రాథమిక పాఠశాలలో 2012లో జాజాల శ్రీనివాస్ చేరినప్పుడు 32 మంది విద్యార్థులే ఉన్నారు. గ్రామంలోని పిల్లలు ఎక్కువ మంది ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లేవారు. ఉన్నతాధికారుల అనుమతితో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడంతో మరుసటి ఏడాది సర్కారు బడిలోవిద్యార్థుల సంఖ్య 85కి పెరిగింది. ఏటా పాఠశాల వార్షికోత్సవం నిర్వహిస్తూ.. అందరి దృష్టి బడిపై పడేలా చేశారు. ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు తీసుకొని గురుకులాల్లో సీట్లు వచ్చేలా చేశారు. ప్రముఖుల చేయూతతో సదుపాయాలు సమకూరడంతో విద్యార్థుల సంఖ్య 250కి పెరిగింది. జిల్లాలో అత్యధిక మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలగా అవతరించింది. ఇటీవల శ్రీనివాస్‌కు సమీపంలోని అక్కపల్లిగూడెం బదిలీ అయింది. ‘మీరున్నచోటే మేమూ చదువుతాం’ అంటూ 130 మంది పిల్లలు అక్కపల్లిగూడెం పాఠశాలలో చేరారు.
ఇంకెందరో ఆణిముత్యాలు
- జనగామ జిల్లా శామీర్‌పేట ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం సుధీర్‌రెడ్డి, ఉపాధ్యాయురాలు ఫాతిమా మేరీలకు బదిలీ అయినా వెళ్లొద్దంటూ విద్యార్థులు బడి గేట్లు మూసివేశారు. విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి పాఠాలు బోధించడమే ఇందుకు కారణం.
- నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లింగసానిపల్లిలో 14 ఏళ్లపాటు ప్రాథమికోన్నత పాఠశాలను అభివృద్ధి చేసి.. నాణ్యమైన విద్య అందించేందుకు అహర్నిశలు కృషి చేసిన ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ బదిలీ అయ్యారు. ఆయనను విద్యార్థులు, గ్రామస్థులు ఊరేగింపుగా తీసుకెళ్లి.. వీడ్కోలు పలికారు. ఇదే జిల్లా డిండి మండలం బావికోల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ముద్దాడ బాలరాజుకు బదిలీకాగా వెళ్లొద్దంటూ ఆయన చుట్టూ చేరిన పిల్లలు కంటతడి పెట్టుకున్నారు.
- సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు మెంతబోయిన సైదులు బదిలీ కాగా ఇక్కడి నుంచి వెళ్లవద్దంటూ పిల్లలు ప్రాధేయపడ్డారు. అదే జిల్లా మేళ్లచెరువు మండలం హేమ్లతండాలో హిందీ ఉపాధ్యాయుడు షేక్ మస్తాన్ సొంత డబ్బులతోపాటు దాతల సాయంతో సౌకర్యాలు కల్పించి, పిల్లల్ని చదువులో రాణించేలా చేశారు. ఆయన బదిలీపై వెళ్లిపోతుంటే పిల్లలు చుట్టుముట్టి రోదించారు.
- ములుగు జిల్లా వెంకటాపురంలోని హిందీ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఆ సబ్జెక్టుపై భయం పోగొట్టి కృత్యాలు, బొమ్మల ద్వారా ఆసక్తి పెరిగేలా చేశారు. యూట్యూబ్ ద్వారా పాఠాలు బోధించారు.
- భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలోని కొండగడప పాఠశాల ఉపాధ్యాయుడు హనుమంతు బదిలీపై వెళుతుండగా… ‘మాతోనే ఉండండి సార్’ అంటూ విద్యార్థులు ఆయన్ని వేడుకున్నారు.
100 మంది పిల్లల జీవితాల్లో ‘నవోదయం’
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం తూంకుంట ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుడు గౌతమ్‌కుమార్ విద్యార్థులతోపాటు గ్రామస్థుల ఆదరాభిమానాలను పొందారు. పాఠశాలకు ఆయన 2013లో వెళ్లినప్పుడు 16 మంది విద్యార్థులే ఉండేవారు. ఇంటింటికీ తిరిగి పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ తనదని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. పాఠశాలలో సెల్‌ఫోన్‌లపై నిషేధం విధించారు. ప్రార్థనకు ముందే ప్రతిరోజూ విద్యార్థులతో ఒక్కో ప్రక్రియ చేయించేవారు. ఒక రోజు ఎక్కాలు, మరో రోజు ఆంగ్ల పదాలు చెప్పించేవారు. ఇలా పిల్లల్లో చదువుపై ఆసక్తి పెంచారు. ఏటా ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో ఈ పాఠశాల నుంచి 100 మందికిపైగా విద్యార్థులు గురుకులాలు, నవోదయ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. అందుకే బదిలీపై వెళ్తోంటే తల్లిదండ్రులు తరలివచ్చి ఆయన్ని ఘనంగా సన్మానించారు.
🖊️బ్యూరో చీఫ్: కె కళ్యాణి, బోధ మరియు మంచుకొండ ఇన్సైట్స్ | ఈనాడు వారి సౌజన్యంతో