అక్కడ అమ్మదే అధికారం…

‘మాకు అమ్మాయిని చూపించండి.. పెళ్లిచేసుకుంటాం..’ లేదంటారా? ‘ఒంటరి బ్రహ్మచారుల ఫించన్‌ కావాలి… స్థానిక ఎన్నికల్లో సీటు కావాలి… ఇల్లు కావాలి…’  గత ఎన్నికల్లో హరియాణాలోని పెళ్లికాని ప్రసాదులంతా ప్రభుత్వాన్ని ఇలానే బెదిరించారు.

వందేళ్ల క్రితం హరియాణాలో ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 867 మంది ఆడపిల్లలు ఉండేవారు. ఇప్పటికీ ఆ నిష్పత్తిలో పెద్దగా తేడా లేదు. కడుపులో ఉన్నది ‘ఆడపిల్ల’ అని తెలిస్తే చాలు భ్రూణహత్యలకి తెగబడేవారు. ఫలితమే అక్కడ బహ్మచారుల సంఖ్య లక్షల్లో ఉంది. విద్యుత్తు, మంచినీరు, ధరల తగ్గింపులాంటి డిమాండ్లతోపాటు ‘పెళ్లికూతుళ్లు కావాలి బాబోయ్‌’ అని మొత్తుకొనే మగవాళ్లు పెరుగుతున్నారు. అప్పటికీ పొరుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలను ఎదురుకట్నం ఇచ్చి కొనితెచ్చుకుంటున్నా ఇదే పరిస్థితి. ఒక్క హరియాణా మాత్రమే కాదు పంజాబ్, ఛండీగఢ్, సిక్కిం, యూపీ, బిహార్‌ల్లోనూ ఆడపిల్లల కొరత ఇలానే ఉంది. వందల ఏళ్లుగా ఆడపిల్లని వద్దనుకుంటే ఏమవుతుందో హరియాణాలాంటి రాష్ట్రాలు ఒక ఉదాహరణలా నిలుస్తోంటే… మరోవైపు ఆడపిల్లని ఆదరించిన కేరళలాంటి రాష్ట్రాల గురించీ తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1084మంది ఆడపిల్లలున్నారు. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. ఇక్కడ ఆడపిల్లని ఆహ్వానించింది… అక్కడి సంస్కృతీ, సంప్రదాయాలే!

1800వ సంవత్సరం నాటిమాట. సాధారణంగా రాజు తర్వాత అతని కొడుక్కే సింహాసనం దక్కుతుంది కదా! కానీ కేరళలోని ట్రావెన్‌కోర్‌లో ఉన్న నాయర్లలో ఇందుకు భిన్నమైన ఆచారం ఉంది. రాజు తర్వాత ఆ సింహాసనం అతని మేనల్లుడికి వస్తుంది. అంటే రాజుగారి సోదరి సంతానానికి అన్నమాట. అలాగే రాజమాత, ఆమె చెల్లెలికీ కూడా విశేష అధికారాలు ఉంటాయి. రాజు భార్యని అమ్మాచి అంటారు. ఆమెకు రాజభవనంలో కాకుండా విడిగా ‘అమ్మవీడు’ అనే ప్రత్యేక భవంతి ఉంటుంది. రాజులు యుద్ధాల్లో మునిగితేలుతున్నప్పుడు పరిపాలనాధికారం అంతా స్త్రీలే చూసుకుంటారు. వాళ్లకీ యుద్ధ విద్యలు వచ్చు. రాజతంత్రాలు తెలుసు. సామాన్యుల ఇళ్లలో కూడా ఆడపిల్ల పుడితే ‘ధారావడు’ అనే తల్లిగారింట్లోనే ఉండాలి. మగపిల్లాడు పుడితే రాజుతోపాటు యుద్ధవిద్యలు నేర్చుకోవడానికి వెళ్లాలి. ఒక వేళ ఆడపిల్ల పుట్టకపోతే దత్తత తీసుకుంటారు. ఇలా అధికారం కలిగిన శక్తిమంతమైన మహిళలని అట్టింగల్‌ రాణీలు అంటారు. వీరి అధికారానికి గుర్తుగా ఇప్పటికీ కొయిక్కల్‌ పాలెస్‌ వంటివి ఇంకా మిగిలే ఉన్నాయి. స్త్రీ శక్తిని గుర్తించే ఈ విధానాన్ని ‘మరుమక్కతయమ్‌’ అంటారు. ఇది ఏదో ఒక ప్రాంతపు ఆచారం అనుకుంటే పొరపాటు. మలబారుతీరం మొత్తంలో మరుమక్కతయం లేదా ఆనందరావర్‌ అనే ఆచారం ఉంది. అక్కడ ఉండే ముస్లిం కుటుంబాలు కూడా ఈ సంప్రదాయం పాటిస్తాయి. అంటే కొడుక్కి కాకుండా చెల్లెలు సంతానానికి అధికారం ఇవ్వడం, వారి పిల్లలకి రక్షణగా ఉండటం చేస్తారు. దీన్ని మాతృస్వామ్యం అనే కంటే మాతృశక్తి వ్యవస్థ అనొచ్చు. ఎందుకంటే ఇక్కడి మహిళలు సింహాసనం చేజిక్కించుకోరు. అంతకంటే శక్తిమంతంగా ఉంటారు. ఆస్తుల్లో ఆడవాళ్లకే ప్రాధాన్యం ఉంటుంది. అక్కడ ఆడపిల్లని కోరి మరీ కంటారు అందుకే. కేరళని ‘ఫిమేల్‌ క్యాపిటల్‌’ అని పిలుచుకుంటారు. అక్షరాస్యత ఎక్కువగా ఉండటానికీ, ధైర్యంగా విదేశాలకు వెళ్లి ఒంటరిగా ఉద్యోగాలు చేసుకోవడానికీ ఈ మూలాలు కూడా కారణమే. అలాగే కర్ణాటకలోని బంట్, బలివాలు కూడా ఆడపిల్లకూ, ఆమె సంతానానికే అధికారం అప్పగిస్తారు. ఈ విధానాన్ని ‘అలియాసంతన’ అంటారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో అయితే మేఘాలయలో ఇక్కడి ఖాసీ తెగ ఇప్పటికీ బలమైన మాతృస్వామ్య వ్యవస్థకి చక్కని ఉదాహరణ. ఈ తెగలో పెళ్లైతే పెళ్లికొడుకు ఇల్లరికం రావాల్సి ఉంటుంది. అలాగే పిల్లలకి తల్లి ఇంటిపేరే వస్తుంది. ఆస్తులు ఆడవాళ్ల పేరిటే ఉంటాయి. తొంభైశాతం వ్యాపారాలు ఆడవాళ్లే చేస్తున్నారు. ఈ విధానాలు అక్కడ ఆడపిల్లల్ని కనడానికి ఏమాత్రం జంకనివ్వవు. పైగా ఆత్మవిశ్వాసాన్నిస్తాయి.

ఓపక్క అందమైన మార్బుల్‌ కోసం కొండలు తవ్వేస్తూ పోతుంటే రాజస్థాన్‌లోని పిప్లాంత్రీ గ్రామం సర్వం కోల్పోయి బోడిగా తయారయ్యింది. వ్యవసాయం లేదు. కరవు తాండవిస్తోంది. ఉపాధిలేదు. మరోపక్క అన్ని చోట్ల ఉన్నట్టుగానే ఆ గ్రామంలోనూ ఆడపిల్లల్ని భారంగా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఆ ఊరి సర్పంచ్‌ పాలీవాల్‌ తన 17 ఏళ్ల అమ్మాయిని అనారోగ్యంతో కోల్పోయాడు. అటు పర్యావరణానికీ, ఇటు ఆడపిల్లల సమస్యకీ పరిష్కారంగా ఆ ఊళ్లో ఆడపిల్ల పుడితే 111 చెట్లు నాటి పండగ చేసుకోవాలన్నాడు పాలీవాల్‌. క్రమంగా ఆ ఊళ్లో వెయ్యి హెక్టార్ల విస్తీర్ణంలో అడవి విస్తరించింది. భూగర్భ జలాలు పెరిగాయి. ఆడపిల్లలతోపాటే పచ్చదనం విస్తరించి కరవుని తరిమేసింది. నాలుగు లక్షల చెట్లు పచ్చగా అల్లుకున్నాయి. ఆ ఊళ్లోని బడిలో ప్రతి 19 మంది అబ్బాయిలకి 33 మంది అమ్మాయిలున్నారు.

  •  తాజా గణాంకాల ప్రకారం ఆర్మేనియా, ఉక్రెయిన్, బెలారస్, లాట్వియా, రష్యా… వంటి దేశాల్లో మహిళల జనాభా ఆ దేశ జనాభాలో సగానికంటే ఎక్కువ. అలాగే మహిళా జనాభా అతి తక్కువగా ఉన్న దేశం ఖతార్‌. ఇక్కడ మహిళలు 27 శాతం మాత్రమే ఉన్నారు. ఆ తరవాత స్థానాల్లో యూఏఈ, బహ్రెయిన్, ఒమన్‌ దేశాలు ఉన్నాయి.
  •  మనదేశంలో 144 కోట్ల జనాభా ఉంటే అందులో సుమారు 69.8 కోట్లమంది మహిళలు.
  •  మన దేశంలో ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకి 948 మంది అమ్మాయిలు ఉన్నారు.

ఇప్పుడిప్పుడే ఆడపిల్లల్ని కావాలి అనుకునే వారి సంఖ్య పెరుగుతుంది, ఇది నిజంగా శుభపరిణామం. కాకపోతే ఇదంతా ఒక ప్రక్క మరొక ప్రక్క ఆడబిడ్డల రక్షణ కూడా సమాజం మీద అతి పెద్ద బాధ్యతగా ఉంది. 

-బ్యూరో చీఫ్: కె కళ్యాణి, బోధ మరియు మంచుకొండ ఇన్సైట్స్ మ్యాగజైన్ | ఈనాడు వసుంధర వారి సౌజన్యంతో… 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top