నిరక్షరాశ్యత, ఉద్యోగావకాశాల్లో పరిమితులు, ఆర్థిక సమస్యల వల్ల మహిళలు పేదరికంలోనే మగ్గిపోవలసిన పరిస్థితి నెలకొంటోంది…
నిరక్షరాశ్యత, ఉద్యోగావకాశాల్లో పరిమితులు, ఆర్థిక సమస్యల వల్ల మహిళలు పేదరికంలోనే మగ్గిపోవలసిన పరిస్థితి నెలకొంటోంది. ఈ సమస్యను పరిష్కరించాలనే సంకల్పంతో ప్రగతి సంస్థ ద్వారా ఆడపిల్లల విద్యావసరాలకు సహాయపడుతోంది ఎడ్యుకేట్ గర్ల్స్ ఫౌండర్, సఫీనా హుస్సేన్. ఆవిడ ఇంటర్వ్యూలో వెల్లడైన విశేషాలివి!
ప్రగతి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది?
భారతదేశంలోని మారుమూల గ్రామాల్లోని నిరక్షరాశ్య సమాజాలను ఆడపిల్లల చదువుల వైపు నడిపించే లక్ష్యంతో ఏర్పడిన సంస్థ ఎడ్యుకేట్ గర్ల్స్. గత 16 ఏళ్లుగా విద్యాహక్కులో భాగంగా ఎనిమిదో తరగతి వరకూ ఆడపిల్లలను చదివించడం మీదే మేం దృష్టి పెట్టాం. ప్రభుత్వ సహాయసహకారాలతో పాటు, భారీ కమ్యూనిటీ వాలంటీర్ల సహాయంతో ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ ద్వారా ఇప్పటివరకూ లక్షల మంది ఆడపిల్లలను బడుల్లో చేర్పించాం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, బీహార్‌లలోని 29 వేల గ్రామాల్లోని ఆడపిల్లలకు చదువును చేరువ చేయగలిగాం!పేదరికం, పితృస్వామ్యం, ప్రయాణ సౌకర్యాల లేమి, సమాజాల్లో సెకండరీ స్కూల్ మౌలిక సదుపాయాల లోపం లాంటి కారణాల వల్ల ఆడపిల్లలు ఎనిమిదో తరగతి తర్వాత బడులు మానేస్తున్నారు. దాంతో కనీస విద్యార్హతలు లేక చిన్న స్థాయి వృత్తుల్లోకి కూడా వాళ్లు ప్రవేశించలేకపోతున్నారు. అంతకు మించి స్వతహాగా సంక్రమించిన హక్కుల పట్ల అవగాహన లేక, కేవలం శారీరక శ్రమతో కూడిన కూలీ పనులు, ఇంటి పనులకే పరిమితమైపోతున్నారు. అలాగే భౌతిక, లైంగిక, కుటుంబపరమైన నిర్ణయాల పట్ల కూడా వాళ్లు నియంత్రణ కోల్పోతున్నారు. ఇలాంటి మహిళల సమస్యలను పరిష్కరించడం కోసం మేం 2021లో ప్రగతి అనే మరొక కార్యక్రమాన్ని చేపట్టాం!
ప్రగతి ప్రధాన లక్ష్యం?
15 నుంచి 29 ఏళ్ల మహిళలు ప్రభుత్వ బడుల నుంచి కనీసం పదో తరగతి పాసయ్యేలా చూడడం మా లక్ష్యం. ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు, వొకేషనల్ ట్రైనింగ్‌లలో ప్రవేశాలకు పదో తరగతి పాసై ఉండడం కీలకం కాబట్టి అమ్మాయిలు పదో తరగతి పూర్తి చేయగలిగే వరకూ బడులు మానుకోకుండా చూసుకోవడం మీదే మేం దృష్టి పెడుతున్నాం. ప్రగతి సంస్థ, చదువు పూర్తి చేసిన ఆడపిల్లలకు ఉద్యోగావకశాలను కల్పించడంలో కూడా సహాయపడుతుంది. ఆరు నెలల సుదీర్ఘమైన విలేజ్ క్యాంప్స్ సహాయంతో స్థానిక పెద్దల తోడ్పాటుతో ఆడపిల్లలు పదో తరగతి పాసయ్యేలా బహిరంగ బడి పాఠ్యప్రణాళికలను అనుసరించేలా ఆడపిల్లలను ప్రోత్సహిస్తుంది. ఈ విషయంలో గ్రామ పెద్దలు ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటారు. చదువు ఈడున్న ఆడపిల్లలను గుర్తించి, పరీక్షలు రాసేవరకూ వాళ్లకు మార్గ నిర్దేశం చేసి, భవిష్యత్తు ఉద్యోగావకాశాల పట్ల వాళ్లకు అవగాహన కల్పిస్తూ ఉంటారు.
బడికి వెళ్లలేని ఆడపిల్లలకు మీరెలాంటి సౌకర్యాలు, సౌలభ్యాలు కల్పిస్తూ ఉంటారు?
మేం కేవలం పాఠ్యపుస్తకాలు, సబ్జెక్టులకే పరిమితం కాకుండా, ప్రాజెక్టు వర్క్స్, జీవన నైపుణ్యాలను మెరుగపరిచే అంశాల పట్ల కూడా అవగాహన ఏర్పరుస్తూ ఉంటాం. సెల్ఫ్ స్టడీ టెక్నిక్స్‌తో పాటు, పీర్ సపోర్ట్ నెట్‌వర్క్స్ అభివృద్ధికి తోడ్పడతాం. అలాగే పరిస్థితులను బట్టి మసలుకోవడం, చాకచక్యంగా మెలగడం, సమస్యలను పరిష్కరించడం లాంటి మెలకువలను కూడా నేర్పిస్తాం. అలాగే పరీక్షా కేంద్రాలకు చేరుకోగలిగే ప్రయాణ మార్గాలు, సాధనాల గురించి కూడా అవగాహన కల్పిస్తాం.
నేను ఢిల్లీలో పుట్టి పెరిగాను. కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో టీనేజీ వయసులోనే చదువు మానుకుని పెళ్లి చేసుకోవలసి వచ్చింది. అయితే మా ఆంటీ ప్రమేయంతో నేను ఆ ప్రమాదం నుంచి గట్టెక్కగలిగి చదువును కొనసాగించగలిగాను. అంతే కాకుండా ఉన్నత చదువుల కోసం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు వెళ్లగలిగాను. అప్పట్లో కూడా ‘‘కూతురి మీద అంత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తున్నావు. ఆడపిల్ల ఎప్పటికైనా పెళ్లి చేసుకోవలసిందే, అలాంటప్పుడు అంత పెట్టుబడి పెట్టడం ఎందుకు?’’ అని మా నాన్నను అడిగినవాళ్లున్నారు. ఏదేమైతేనేం చివరకు అవరోధాలను జయించి, ఉన్నత చదువు చదువుకోగలిగాను. నాలా అమ్మాయిలందరికీ ఆదరణ, సహాయసహకారాలు దొరకడం కష్టం. కాబట్టే ఆడపిల్లలకు విద్యను అందించడం కోసం నా వంతు కృషి చేస్తున్నాను.
మీ భవిష్యత్తు ప్రణాళికలు?
రాబోయే పదేళ్లలో కోటి మంది ఆడపిల్లలు పదో తరగతి పూర్తి చేసేలా సహాయపడాలన్నదే మా లక్ష్యం. ప్రభుత్వ సహాకారంతో మారుమూల గ్రామాల్లో బహిరంగ బడలును నెలకొల్పి ఆడపిల్లలు చదువుకుని, స్వయంస్వావలంబన సాధించడంలో సహాయపడాలని భావిస్తున్నాం. కలలు కనే ప్రతి ఆడపిల్లా ఆ కలలను నిజం చేసుకోవడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది. విద్య అనేది ఒక ప్రత్యేక హక్కు కాదు, అది జన్మహక్కు. చదువు, మన మీద మనం పెట్టుకునే పెట్టుబడి. తరగని ఆస్థి. ఈ వాస్తవం నగీనా బానో మాటల్లోనే వెల్లడైంది. నగీనా… హింసకు గురై, పట్టించుకోకుండా వదిలేసిన బాల వధువు. ఆ అమ్మాయి చదువుతో తన జీవితాన్ని సరిదిద్దుకుని, పిల్లలకు మంచి భవిష్యత్తును అందించగలిగింది. ఆ చదువుల ఛాంపియన్ తన అనుభవం గురించి మాట్లాడుతూ… ‘‘నా చదువే నా సొంత ఆస్తి. దాన్నెవరూ నా నుంచి దూరం చేయలేరు. దాన్నెవరూ దొంగిలించలేరు. ఎలాంటి వరదలూ, కరవులూ దాన్ని నా నుంచి లాగేసుకోలేవు. చనిపోయేవరకూ నా చదువు నాతోనే ఉంటుంది’’ అని ఒక సందర్భంలో నాతో చెప్పింది. నగీనాలా ఆడపిల్లలందరూ చదువు విలువను తెలుసుకుని తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలనే లక్ష్యంతోనే నేను ప్రగతి సంస్థను నెలకొల్పాను. అర్థాంతరంగా చదువును మానేసే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. కర్జున అనే అమ్మాయి తొమ్మిదో తరగతిలో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైంది. ఆ అమ్మాయికి చదువుకోవాలని ఉన్నా, చదువులో వెనకబడడంతో ఆమెను చదువు మాన్పించేశారు. వాళ్ల గ్రామంలో ప్రగతి క్యాంప్ ఏర్పాటైనప్పుడు, ఆ అమ్మాయి చదువును కొనసాగించాలనే కోరికను బయల్పరిచింది. అలా మా ప్రగతి సంస్థ సహాయంతో తన గ్రామంలోనే ఒక చిన్న దుకాణాన్ని నెలకొల్పుకోగలిగింది. అలాగే తన చదువును పూర్తి చేసి, వ్యాపారాన్ని విస్తరించుకోగలిగింది.