చిన్నారుల ఒత్తిడి చిన్నది కాదు

పిల్లలంతా ఎప్పుడో అప్పుడు ఒత్తిడికి లోనవ్వటం మామూలే. హోంవర్క్‌ చేసేటప్పుడో, స్నేహితుల గురించో, వార్షిక పరీక్షలు రాసేటప్పుడో ఆందోళన చెందటం చూస్తూనే ఉంటాం.

రోజువారీ జీవితంలో ఒత్తిడికి గురిచేసే అంశాలెన్నో ఎదురవు తుంటాయి. ఇవి చాలావరకూ అదుపు తప్పకుండానే చూసుకుంటాం. చిన్న పిల్లలకైతే తల్లిదండ్రులు, పెద్దవారు భరోసా కల్పిస్తే తేలికగానే కుదురు కుంటారు. నిజానికి మామూలు ఒత్తిడి జీవితంలో ఎదగటానికి, నేర్చు కోవటానికి అత్యవసరం కూడా. సాధారణ ఒత్తిడిని సానుకూలంగా మలచుకుంటే పిల్లల సామర్థ్యం ఇనుమడిస్తుంది. నైపుణ్యాలూ పెరుగుతాయి. అయితే దీర్ఘకాలం కొనసాగుతూ వచ్చే ఒత్తిడితోనే ఇబ్బంది. శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురైతే తీవ్ర వేదన కలిగిస్తాయి. కుటుంబంలో కలహాలు సైతం పిల్లల మనసులను కుంగదీస్తాయి. తీవ్ర మానసిక సమస్యలతో బాధపడేవారితో, వ్యసనాలకు లోబడినవారితో జీవించటం.. చుట్టుపక్కల హింస, వివక్ష, తీవ్ర పేదరికం మూలంగానూ మానసిక సమస్యల ముప్పు పెరుగుతుంది. ఇవి చదువుల మీదే కాదు.. సామాజిక సంబంధాల పైనా విపరీత ప్రభావం చూపుతాయి. పిల్లలు అప్పుడప్పుడే ఒత్తిడికి స్పందించటం నేర్చుకుంటూ వస్తుంటారు. ఇలాంటి సమయంలో తీవ్ర, దీర్ఘకాల ఒత్తిడికి గురైతే స్పందించే సామర్థ్యమూ కుంటుపడుతుంది. ఇది మున్ముందు ఆరోగ్యం మీద చాలాకాలం పాటు ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగని బాల్యంలో బాధలు, ఇబ్బందులు ఎదుర్కొన్న పిల్లలందరికీ పెద్దయ్యాక ఆరోగ్య సమస్యలు వస్తాయని కాదు. సానుకూల జీవితానుభవాలు, ఆరోగ్యకరమైన సంబంధాలు పిల్లలను, యువతను తీర్చిదిద్దుతాయి. సురక్షితమైన, స్థిరమైన నమ్మకమైన సంబంధాలు కలిగుంటే ఒత్తిడికి గురిచేసే పరిస్థితుల నుంచి బయటపడటానికి తోడ్పడతాయి.

బాల్యంలో కొందరు తీవ్ర ఒత్తిడి, బాధామయ పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఇలాంటి అనుభవాలను చవిచూసినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. సుమారు ఆరుగురిలో ఒకరు నాలుగు, అంతకన్నా ఘటనలను ఎదుర్కొన్నవారేననీ వివరిస్తున్నాయి. ఇలా ఎక్కువసార్లు ఒత్తిడికి గురైతే పెద్దయ్యాక మధుమేహం, ఊబకాయం, గుండెజబ్బు, పక్షవాతం వంటి సమస్యలు వచ్చే అవకాశం పెరిగే ప్రమాదముంది. అంతేకాదు.. ఆందోళన, కుంగుబాటు, మాదకద్రవ్యాల వ్యసనం వంటి మానసిక సమస్యల ముప్పూ పెరుగుతుంది. తల్లిదండ్రుల సంరక్షణ, ఆప్యాయత, ప్రేమ కొరవడటమూ ఇందుకు దోహదం చేస్తుండటం గమనార్హం. 

ఇంతకుముందు శాస్త్రవేత్తలు ఎన్నిసార్లు పిల్లలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారనే దాని మీదే ప్రధానంగా దృష్టి సారించారు. ఇప్పుడు ఆయా అనుభవాల రకాలు, వాటి మధ్య తేడాలను గుర్తించటానికీ ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే కొన్ని అనుభవాలు ప్రధానంగా విషయగ్రహణ.. మరికొన్ని భావోద్వేగాలు, సామాజిక సంబంధాల అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించి, విషయగ్రహణ సామర్థ్యం మీద ప్రభావం చూపుతున్న ఆరు రకాల ప్రతికూల అనుభవాలను గుర్తించారు. ఉదాహరణకు- కొందరు పిల్లలు కేవలం కుటుంబ అస్థిరత్వాన్ని మాత్రమే ఎదుర్కొన్నారు. మరికొందరు కుటుంబ అస్థిరత్వం, కుటుంబ సభ్యుల మరణం, పేదరికం.. ఈ మూడింటినీ ఎదుర్కొన్నారు. ఇవి పిల్లల మెదడు మీద వేర్వేరుగా ప్రభావం చూపుతుండటం గమనించదగ్గ విషయం. అయితే తమకు ఎదురయ్యే ఘటనలను పిల్లలంతా ఒకేలా తీసుకోరు. ఆయా ఘటనలపై వారి సొంత అభిప్రాయం, మెదడు వాటిని తట్టుకునే తీరు మీద ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. 

ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడటం వల్ల కలిగే సానుకూల ప్రయోజనాల మీదా మరికొందరు శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ఆయా పరిస్థితులకు అనుగుణంగా మారటానికి మెదడు నిరంతరం ప్రయత్నిస్తుంటుంది. పిల్లల్లో ఇంకా ఎదుగుతున్న మెదడు ఇలాంటి ప్రతికూల ఘటనలకు తగినట్టుగా ప్రవర్తించేలా తోడ్పడుతుంది. ఉదాహరణకు- అనూహ్యంగా మారిపోయే వాతావరణంలో జీవించేవారు త్వరగా వాటికి అనుగుణంగా నడచుకోవటానికి, లక్ష్యాలను మార్చుకోవటానికి అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకునేలా చేస్తుంది. అయితే మంచి దన్ను, భరోసా లభించినప్పుడు ఇవి మరింత మెరుగవుతున్నాయనీ పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దవాళ్ల సంరక్షణ ఇందులో సాయం చేస్తున్నాయని వివరిస్తున్నారు. 

బాల్యంలో సానుకూల ధోరణి పెంపొందటానికి పెద్దవాళ్ల తోడు చాలా ముఖ్యం. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, రోజువారీ ఎదురయ్యే ఒత్తిడికి గురైనప్పుడు ఇది ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆత్మీయులు ఎవరైనా సరే. పిల్లలకు అండగా నిలిస్తే వారి భవిష్యత్తును కాపాడినట్టే. పెద్దవాళ్లు ఆరోగ్యకరమైన నైపుణ్యాలను నేర్పించటం, వీటి విషయంలో మార్గదర్శకంగా ఉండటం కీలకం. అందువల్ల పెద్దవాళ్లకూ శిక్షణ అవసరమేనని పరిశోధకులు భావిస్తున్నారు. తల్లిదండ్రులు కుంగుబాటుకు లోనైతే పిల్లలకు అవసరమైన అన్ని పనులనూ చేయలేకపోవచ్చు. ఇది పెంపకంలోనూ అడ్డంకిగా మారుతుంది. చుట్టుపక్కల వాతావరణం సురక్షితంగా ఉండేలా చూసుకోవటం, ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు నెలకొల్పుకోవటం వంటివీ అవసరమే. ఇలా ఆర్థిక ఇబ్బందుల వంటి వాటి ప్రభావం పిల్లల మీద పడకుండా కాపాడుకోవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంలో సానుకూల పద్ధతులను పాటించటం, రోజువారీ పనుల్లో క్రమశిక్షణ పాటించటం, ఎప్పుడైనా పనుల తీరు మారిపోతే ఆ విషయాన్ని ముందే పిల్లలకు చెప్పటం వంటి జాగ్రత్తలతో బాలల భవిష్యతును బంగారుమయం చేయొచ్చు.  

🖊️బ్యూరో చీఫ్: కె కళ్యాణి, బోధ మరియు మంచుకొండ ఇన్సైట్స్  | ఈనాడు వారి సౌజన్యంతో 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top